

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై భారత్ రాష్ట్ర సమితి చేస్తున్న తప్పుడు ప్రచారంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మంత్రి దానసరి అనసూయ సీతక్క వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుపై దాఖలైన ఈ కేసులో టెండర్ పత్రాలు, చెల్లింపుల వివరాలను పరిశీలించిన కోర్టు.. రూ.30 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఒక్కో మొబైల్ ఫోన్‌ను ₹11,650 ధరకు కొనుగోలు చేయగా, ₹8,499 విలువైన ఫోన్‌ను ₹14,499కు కొనుగోలు చేశారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ ఆరోపణలు మంత్రి సీతక్క ప్రతిష్ఠను దెబ్బతీయడానికేనని పిటిషనర్ తరఫు వాదనతో కోర్టు ఏకీభవించింది. ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏప్రిల్ 10న చేసిన పోస్టులను తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్, కేసీఆర్‌లను కోర్టు ఆదేశించింది. సీతక్క తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ వాదనలు వినిపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!