

శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన కార్యాలయాల్లో ఏఐ పాత్రపై కొత్త చర్చకు తెరతీసింది. ‘ఆండన్ ల్యాబ్స్’ నిర్వహిస్తున్న ప్రయోగాత్మక ‘ఆండన్ మార్కెట్’ స్టోర్ నిర్వహణ బాధ్యతలను ‘లూనా’ అనే ఏఐ మేనేజర్‌కు అప్పగించారు. ఉత్పత్తుల ఎంపిక, ధరల నిర్ణయం, బ్రాండింగ్‌తో పాటు సిబ్బంది నియామకం, నిర్వహణ వంటి బాధ్యతలను కూడా లూనాకు అప్పగించారు.
ఈ స్టోర్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా విధులకు హాజరయ్యారు. లూనా హాజరుకు సంబంధించి ఓ విధానాన్ని రూపొందించినప్పటికీ, దాన్ని నిరంతరం అమలు చేయలేకపోయింది. అనంతరం పరిశోధకులు పాత విధానాలను సమీక్షించి, ఉద్యోగి పనితీరును అంచనా వేయాలని లూనాను కోరారు. దీంతో ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని ఏఐ సిఫార్సు చేసింది. అయితే మానవ సిబ్బంది ఆ సిఫార్సును సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుని తొలగింపు ప్రక్రియను పూర్తి చేశారు.
ఆండన్ ల్యాబ్స్ సీఈఓ లూకాస్ పీటర్సన్ ఈ ఘటనను అనైతికంగా భావించడం లేదని తెలిపారు. మానవ మేనేజర్ ఉండి ఉంటే మరింత ముందుగానే చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏఐ భవిష్యత్తులో ఆర్థిక విలువను సృష్టించగలదని, అయితే భౌతిక శ్రమ అవసరమైన రంగాల్లో దానికి పరిమితులు ఉంటాయని వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రయోగాత్మక స్టోర్ లాభాల్లోకి రాలేదు. ఐదు నెలల క్రితం ప్రారంభించిన సమయంలో ఉన్న 1,00,000 డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు సుమారు 61,186 డాలర్లకు తగ్గినట్లు సమాచారం. ఏఐకి అప్పగించగల బాధ్యతలు పెరుగుతున్నప్పటికీ, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి, నిబంధనలను స్థిరంగా అమలు చేయడం వంటి అంశాల్లో ఇంకా పరిమితులు ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!