

ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, రుణమాఫీ, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలపై మాట్లాడారు.
రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని సీఎం తెలిపారు. ప్రభుత్వంలోని ఏ ఉద్యోగ ఖాళీని గాలికి వదిలేయబోమని, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి ఏటా రూ.75 వేల కోట్లు చెల్లిస్తున్నామని, సంక్షోభంలో ఉన్న సంక్షేమ వ్యవస్థను గాడిలో పెడుతూ తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!