

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 23వ రోజు నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కింది. కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే విభేదాలతో ఉన్న అపూర్వ, ముకేశ్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కెప్టెన్‌గా అపూర్వ తీసుకుంటున్న నిర్ణయాలను ముకేశ్ ప్రశ్నించాడు. కెప్టెన్ సీటులో ఎవరూ కూర్చోకూడదనే నిబంధన ఉన్నప్పుడు వర్షిణిని అక్కడ కూర్చోనివ్వడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తన నిర్ణయం తన ఇష్టమని అపూర్వ స్పష్టం చేయడంతో ఇద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. రథం టాస్క్‌లో భైరవ టీమ్ విజయం సాధించడంతో ఆ జట్టులోని ప్రతి సభ్యుడికి నామినేట్ చేసే అవకాశం లభించింది.
నామినేషన్స్‌లో కంటెస్టెంట్లు ఒకరి ప్రవర్తన, గొడవలు, ఇంటి పనులు, టాస్కుల్లో వ్యవహరించిన తీరు, గతంలో జరిగిన ఘటనలను కారణాలుగా చూపించారు. త్రిగుణ్ రోహిత్‌ను నామినేట్ చేస్తూ ‘కవరింగ్ స్టార్’ అంటూ సెటైర్లు వేశాడు. ప్రతి గొడవకు రోహిత్ కొత్త వివరణతో ముందుకు వస్తాడని ఆరోపించాడు. ఝాన్సీ సృష్టిని నామినేట్ చేయగా, టాస్కుల్లో అమన్ త్వరగా రెచ్చిపోతున్నాడంటూ నరేష్ అతడిని నామినేట్ చేశాడు. పదే పదే నోరు జారడం, కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడం వంటి కారణాలతో రామ్ ప్రసాద్ షాలినిని నామినేట్ చేశాడు. మరోవైపు అమన్, అపూర్వ కూడా త్రిగుణ్‌ను నామినేట్ చేయడంతో హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కింది.
23వ రోజు నామినేషన్స్ ముగిసే సమయానికి ముకేశ్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి మొత్తం తొమ్మిది మంది ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. హౌస్‌లో సన్నిహితంగా ఉండే రోహిత్, అమన్, సృష్టి, షాలినీ నలుగురూ ఒకేసారి నామినేషన్స్‌లోకి రావడం ఈ వారంలో ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ ఫలితం తేలనుండగా, మరోవైపు అపూర్వ–ముకేశ్ మధ్య కొనసాగుతున్న విభేదాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!