

న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత సీనియర్ ఆటగాళ్లకు తగినంత రెడ్‌బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ ఉండేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 22న ప్రారంభమయ్యే భారత్ పర్యటనలో ముందుగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 19, 27 తేదీల్లో రెండు టెస్టులు జరగనున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో భారత్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫిట్‌గా ఉన్న సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్, ముఖ్యంగా రంజీ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడేలా చూడాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ కూడా రంజీ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆటగాళ్ల పని భారం, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇటీవల గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్, మ్యాచ్ ప్రాక్టీస్‌పై సెలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. అవసరమైతే రంజీ మ్యాచ్‌కు బదులుగా భారత్ ‘ఎ’ తరఫున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో అతడిని ఆడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విదేశీ టెస్టు సిరీస్‌కు ముందు రెడ్‌బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ లోపించడం గతంలో ఇబ్బందులు కలిగించిన నేపథ్యంలో ఈ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!