

బెంగళూరుకు చెందిన ఓ యువతి ఐటీ ఉద్యోగాన్ని వదిలి ర్యాపిడో ఆటో డ్రైవర్‌గా మారిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. తండ్రి హఠాన్మరణం తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇంట్లో తల్లిని ఒంటరిగా వదిలి నైట్ షిఫ్టుల్లో పనిచేయడం కష్టంగా మారడంతో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే స్వతంత్రంగా సంపాదించేందుకు ఆటో నడపడాన్ని ఎంచుకుంది. ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తొలుత వ్యతిరేకించినప్పటికీ.. ఆమె వెనక్కి తగ్గకుండా తన నిర్ణయాన్ని కొనసాగించింది.
ఇటీవల కంటెంట్ క్రియేటర్ తన్వి ఆమె ఆటోలో ప్రయాణించిన సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెతో జరిగిన సంభాషణలో యువతి తన ఐటీ నేపథ్యం గురించి చెప్పడంతో తన్వి ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఆటో నడపడం తనకు ఇబ్బందిగా అనిపించడం లేదని, ఐటీ ఉద్యోగం కంటే ఈ వృత్తిలోనే ఎక్కువ సంపాదిస్తున్నానని ఆమె చెప్పినట్లు వీడియోలో వెల్లడైంది. ముఖ్యంగా తనకు అనుకూలమైన సమయాల్లో పనిచేసుకుంటూ రాత్రివేళ తల్లికి తోడుగా ఉండగలగడం ఈ ఉద్యోగం వల్ల సాధ్యమవుతోందని తెలిపింది. ఈ సంభాషణను తన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వీడియో వైరల్‌గా మారింది. ఇతరుల అభిప్రాయాలను పక్కనపెట్టి స్వతంత్రంగా జీవితం ఎంచుకున్న యువతి ధైర్యాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!