

ఉద్యోగులు తమ విధులను సమర్థంగా నిర్వర్తించడంతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ సాంస్కృతిక ఉత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్పెషల్ సీఎస్ మహేష్ దత్ హెక్కా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పని ఒత్తిడి మధ్య విధులు నిర్వహించే ఉద్యోగులకు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు.
క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం ఉద్యోగులకు మానసిక, శారీరక ఉల్లాసాన్ని అందిస్తాయని జూపల్లి పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు, సిబ్బందిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఉద్యోగులు కేవలం విధులు, ఫైళ్లు, బాధ్యతలకే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకతను కూడా ప్రదర్శించాలని సూచించారు. గెలుపు, ఓటమి కంటే కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రతిభను చాటుకోవడం, సహోద్యోగులతో ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యమన్నారు. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!