

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థలపై యూరోపియన్ యూనియన్ (EU) వరుసగా భారీ జరిమానాలు విధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలు అన్యాయమైనవని, వివక్షపూరితమైనవని ఆరోపిస్తూ, అమెరికా ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద ఈయూపై వాణిజ్య విచారణ ప్రారంభిస్తామని, అవసరమైతే భారీ టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.
ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్, యాపిల్‌పై 15 బిలియన్ డాలర్లు, మెటాపై 3 బిలియన్ డాలర్లు, అమెజాన్‌పై 2.5 బిలియన్ డాలర్ల జరిమానాలు ఈయూ విధించిందని పేర్కొన్నారు. అలాగే గూగుల్‌పై మరో 1 బిలియన్ డాలర్ల జరిమానా విధించినట్లు సమాచారం ఉందని, దీంతో గూగుల్‌పై ఈయూ విధించిన మొత్తం జరిమానాలు 18 బిలియన్ డాలర్లకు పైగా చేరాయని తెలిపారు.
అమెరికా వ్యాపార సంస్థలను, పన్ను చెల్లింపుదారుల డబ్బును యూరప్ ఇకపై "పిగ్గీబ్యాంక్"లా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ వాణిజ్య విధానాలపై సెక్షన్ 301 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ చర్యలు అమల్లోకి వస్తే అమెరికా–యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!