

పీఎల్ క్యాపిటల్ గ్రూప్ సీఎండీ అమీషా ఓరా కొత్త మదుపర్లకు కీలక సూచనలు చేశారు. ఆదాయం ప్రారంభమైన వెంటనే పెట్టుబడులు మొదలుపెట్టి, ట్రెండింగ్ వార్తలు లేదా మార్కెట్ వదంతుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఒకే రంగానికి పరిమితం కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులను విస్తరించాలని, పెట్టుబడి పెట్టే కంపెనీల వ్యాపారం, ఆర్థిక స్థితిగతులపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. మార్కెట్‌ను ముందుగానే అంచనా వేసి సరైన సమయంలో కొనుగోలు, అమ్మకాలు చేయాలనే ప్రయత్నం కంటే క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించడం ముఖ్యమని తెలిపారు. కుటుంబ ఆర్థిక నిర్ణయాలు, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో మహిళల భాగస్వామ్యం కూడా మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు.
వచ్చే 12-18 నెలల్లో భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలకు అవకాశం కల్పించవచ్చని అమీషా ఓరా అంచనా వేశారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో పాటు యంత్రపరికరాలు, రక్షణ రంగాలపై సానుకూల దృక్పథం వ్యక్తం చేశారు. దీర్ఘకాలానికి ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, టైటాన్ వంటి లార్జ్‌క్యాప్ షేర్లను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. గర్వారే హైటెక్ ఫిల్మ్స్, పార్క్ హోటల్స్, రాజేశ్ పవర్ సర్వీసెస్, బ్లూస్టార్‌ను గమనించాల్సిన కంపెనీలుగా ప్రస్తావించారు. అయితే ముడి చమురు ధరల పెరుగుదల, వర్షపాత పరిస్థితులు, కార్పొరేట్ ఆదాయాల్లో మందగమనం వచ్చే ఏడాది మార్కెట్‌కు ప్రధాన సవాళ్లుగా మారవచ్చని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!