

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ రంగాలకు చెందిన షేర్లలో భారీగా అమ్మకాలు జరగడంతో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 1,500 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 450 పాయింట్లకు పైగా క్షీణించి 25,400 స్థాయి దిగువన ముగిసింది. ఇటీవల వరుస సెషన్లలో మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేయడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం ఈ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు తగ్గి సుమారు రూ.508 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఒక్కరోజులోనే మదుపర్ల సంపద గణనీయంగా ఆవిరైంది.
సెన్సెక్స్ గత ముగింపు 83,919.71 పాయింట్లతో పోలిస్తే ఉదయం 84,421.97 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తొలుత 84,662.96 పాయింట్ల గరిష్ఠాన్ని తాకినప్పటికీ, ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 82,395.88 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. చివరికి 1,483.72 పాయింట్ల నష్టంతో 82,435.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 450.95 పాయింట్లు కోల్పోయి 25,349.65 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.91గా నమోదైంది. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, ఐటీసీ షేర్లలోనూ క్షీణత కనిపించింది. ఈ నెలలో నిఫ్టీ దాదాపు 10 శాతం పెరగడంతో లాభాల స్వీకరణ, అధిక వెయిటేజీ కలిగిన షేర్ల పతనం, డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు, డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనపడటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని విశ్లేషకులు పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!