

గోదావరి పుష్కరాలు-2027ను ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని 74 ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.1,115 కోట్లు కేటాయించినట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు జరగనున్నాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ అభివృద్ధికి రూ.324 కోట్లు, కాళేశ్వరం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయానికి రూ.198 కోట్లు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి రూ.276 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
ఇదే సందర్భంగా పుష్కరాల అధికారిక లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పనకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఉత్తమంగా నిలిచిన మూడు ఎంట్రీలకు వరుసగా రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల బహుమతులు అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. లోగోతో పాటు ఐదు పదాలకు మించకుండా ట్యాగ్‌లైన్ రూపొందించి పంపాలి. ఎంట్రీలు పంపేందుకు నవంబర్ 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. godavaripushkaralutg@gmail.com ఈ-మెయిల్ ద్వారా లేదా హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పోస్టు ద్వారా, నేరుగా ఎంట్రీలు పంపవచ్చు. మొదటి 100 మంది పాల్గొనేవారికి సర్టిఫికెట్లు అందజేయనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!