

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ (పీపుల్ అండ్ టాలెంట్) ఇరా బింద్రా ప్రపంచవ్యాప్తంగా టాప్ 40 చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ల (సీహెచ్‌ఆర్‌వో) జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. గతేడాది 28వ స్థానంలో నిలిచిన ఆమె.. తాజాగా 19వ ర్యాంకును దక్కించుకున్నారు. అంతేకాకుండా, ఈ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ జాబితాలో వరుసగా రెండో ఏడాది చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఎన్2గ్రోత్ ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది. సంస్థల పనితీరు, ఉద్యోగుల అభివృద్ధి, కార్యాలయ సంస్కృతిపై సానుకూల ప్రభావం చూపిన ప్రతిభావంతులైన హెచ్‌ఆర్ నాయకులను ఈ జాబితా ద్వారా గుర్తిస్తుంది. ఈ ఏడాది 'స్పష్టత' (Clarity) అనే థీమ్ ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది.
ఇరా బింద్రాకు అంతర్జాతీయ వ్యాపార, మానవ వనరుల నిర్వహణ రంగాల్లో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో చేరడానికి ముందు అమెరికాకు చెందిన మెడ్‌ట్రానిక్, జనరల్ ఎలక్ట్రిక్ సంస్థల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు కీలకమైన సీనియర్ హోదాల్లో పనిచేశారు. ఉద్యోగుల ప్రతిభను గుర్తించడం, మానవ వనరుల అభివృద్ధి, సంస్థాగత పనితీరును మెరుగుపరచడంలో ఆమెకు విశేష అనుభవం ఉంది. ప్రపంచస్థాయి హెచ్‌ఆర్ నాయకుల జాబితాలో ఆమె స్థానం మెరుగుపడటం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపుగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!