

పెరిగిన బంగారం ధరలు, విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు ప్రభావంతో భారత్‌లో పసిడి డిమాండ్ తగ్గింది. ప్రపంచ స్వర్ణ మండలి (WGC) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ బంగారం డిమాండ్ 6 శాతం తగ్గి 131.4 టన్నులకు చేరింది. బంగారం దిగుమతులపై సుంకాల పెంపు కూడా డిమాండ్‌పై ప్రభావం చూపింది. దీంతో ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75.1 టన్నులకు పరిమితమైంది. అయితే బంగారం ధరలు భారీగా పెరగడంతో విలువ పరంగా మార్కెట్ 50 శాతం పెరిగి రూ.1.98 లక్షల కోట్లకు చేరుకుంది. 2026లో భారత్‌లో మొత్తం బంగారం డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉండొచ్చని డబ్ల్యూసీజీ అంచనా వేసింది.
మరోవైపు, పెట్టుబడి పరంగా బంగారంపై ఆసక్తి పెరిగింది. బంగారం బార్లు, కాయిన్ల డిమాండ్ 9 శాతం పెరిగి 50.3 టన్నులకు చేరగా, గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు 4.2 టన్నులకు చేరాయి. అదే సమయంలో బంగారం రీసైక్లింగ్ 17 శాతం తగ్గి 19.2 టన్నులకు, నికర బంగారం దిగుమతులు 23 శాతం తగ్గి 98.1 టన్నులకు పడిపోయాయి. దిగుమతి సుంకాల పెంపు, చట్టబద్ధమైన డిమాండ్ తగ్గడం వల్ల గ్రే మార్కెట్ కార్యకలాపాలు, స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూసీజీ రీజినల్ సీఈఓ సచిన్ జైన్ అభిప్రాయపడ్డారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!