

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా మరోసారి వాహన ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటంతో ధరల సవరణ అవసరం ఏర్పడిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. వచ్చే నెలలో మరోసారి ధరలను పెంచడం అనివార్యం కావచ్చని ఆయన సంకేతాలిచ్చారు. దేశీయ మార్కెట్లో కొత్త బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడళ్లను విడుదల చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు బీఎండబ్ల్యూ ఇండియా మూడు దఫాల్లో వాహన ధరలను మొత్తం 5 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే.
రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదలతో కంపెనీపై వ్యయ భారం పెరుగుతోందని బీఎండబ్ల్యూ ఇండియా పేర్కొంటోంది. ముఖ్యంగా దిగుమతి చేసుకునే విడిభాగాలు, అంతర్జాతీయంగా మారుతున్న ఉత్పత్తి వ్యయాలు లగ్జరీ కార్ల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ధరల సవరణపై కంపెనీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొత్త 7 సిరీస్ మోడళ్లతో భారత లగ్జరీ కార్ల మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు బీఎండబ్ల్యూ ప్రయత్నిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!