

టాటా గ్రూప్ వ్యాపారాల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎదురుదెబ్బ తగిలినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సును రద్దు చేసుకునేందుకు టాటా సన్స్ 2024 మార్చిలో సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించినట్లు సమాచారం. స్టాక్ మార్కెట్‌లో షేర్ల నమోదును తప్పించుకునే ఉద్దేశంతోనే ఈ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఆర్‌బీఐ లేదా టాటా గ్రూప్ అధికారికంగా స్పందించలేదు.
ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో టాటా సన్స్‌కు ఐపీఓ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లను నమోదు చేయాల్సిన పరిస్థితి రావచ్చని సమాచారం. గత నెలలో ఆర్‌బీఐ విడుదల చేసిన అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీల తాజా జాబితాలో టాటా సన్స్ పేరు కొనసాగింది. ఈ కేటగిరీలో ఉన్న సంస్థలు పాలన, పెట్టుబడులు, సమాచార బహిర్గతం వంటి అంశాల్లో కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అలాగే తమ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో టాటా సన్స్ భవిష్యత్తులో ఐపీఓకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!