

మంత్రి పదవి నుంచి తొలగించడంపై తనకు బాధ లేదని, అయితే ఎలాంటి కారణం లేకుండా పదవి నుంచి తప్పించడం మాత్రం బాధ కలిగించిందని వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. పదవులు శాశ్వతం కావని, ప్రజల్లో చిరస్థాయిగా నిలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బర్తరఫ్ తర్వాత తొలిసారి వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో భర్త కొండా మురళితో కలిసి సమావేశమైన ఆమె.. ప్రస్తుతం రాజకీయాల్లో అవకాశవాదం పెరిగిపోయిందని విమర్శించారు.
ఎంపీపీ స్థాయి నుంచి మంత్రి పదవి వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించానని సురేఖ తెలిపారు. తాను నమ్మిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోసం గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. బర్తరఫ్ అనంతరం కొందరు అల్లర్లు చేయాలని ఫోన్ చేసినా.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కార్యకర్తలకు సూచించినట్లు చెప్పారు. మంత్రి పదవి పోయినంత మాత్రాన ఇంట్లో కూర్చోబోమని, ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!