

రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో అమెరికాలోని మియామిలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ నేరుగా భేటీ కానున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఖండించారు. పుతిన్, జెలెన్‌స్కీ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు.
జెలెన్‌స్కీ పుతిన్‌తో నేరుగా చర్చలు జరపాలంటే మాస్కోకు రావాల్సిందేనని పెస్కోవ్ పునరుద్ఘాటించారు. రష్యా వెలుపల మరే ప్రదేశంలోనూ ఇరువురి మధ్య చర్చలు నిర్వహించేందుకు తాము అంగీకరించబోమని తెలిపారు. మరోవైపు, జీ20 సదస్సుకు పుతిన్ హాజరవుతారా లేదా అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. జీ20 సందర్భంగా అమెరికా తనను, పుతిన్‌ను ఆహ్వానిస్తే రష్యా అధ్యక్షుడితో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ ఇటీవల తెలిపారు. యుద్ధం విషయంలో మాస్కో వైఖరే కీలకమని, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రష్యా సేనలను ఎదుర్కొనే విషయంలో ఉక్రెయిన్ మరింత బలంగా ఉందని పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!