

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ప్రస్తుతం ఆసియా కప్ ఫైనల్‌కు సిద్ధమవుతోంది. ఇటీవలే టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆమె అరుదైన ఘనత సాధించింది. ఈ క్రమంలో ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మంధానకు వ్యాఖ్యాత రాజ్ షమాని తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన రాత్రి గురించి ప్రశ్నించారు. కాసేపు ఆలోచించిన ఆమె.. ‘‘వరల్డ్ కప్ గురించి అనుకుంటా’’ అని సమాధానమిస్తూ భావోద్వేగానికి గురైంది. ‘‘నేను కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడతా’’ అని చెప్పిన మంధాన.. కొవిడ్ కాలం కూడా తనకు ఎంతో కఠినమైన సమయమని పేర్కొంది.
అదే సమయంలో తన వ్యక్తిత్వం, కోపం గురించి కూడా మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎవరూ నాకు అంత దగ్గరగా అనిపించరు. నాకు చాలా కోపం వస్తుంది. అందుకే నాతో పెట్టుకోవద్దనే ధోరణితో ఉండేదాన్ని. నేను మీ దారికి అడ్డురానంతవరకు.. నా దారికి మీరు అడ్డురావద్దు’’ అని చెప్పింది. తాను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని కాదని, ఎవరినీ వెంటనే మరిచిపోనని తెలిపింది. ‘‘మనుషులను క్షమిస్తా.. కానీ జరిగిన ఘటనను మాత్రం మరిచిపోను’’ అని మంధాన పేర్కొంది. గతంలో పలాశ్ ముచ్చల్‌తో వివాహం వరకు వెళ్లిన ఆమె బంధం అనూహ్యంగా ముగిసిన విషయం తెలిసిందే. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఘటన గురించే ఆమె భావోద్వేగానికి గురై ఉంటుందని అభిమానులు, నెటిజన్లు చర్చిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!