

డిజిటల్ ఆస్తుల మార్కెట్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో, భారత ఆర్థిక నిఘా విభాగం (FIU) క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల కోసం మరింత కఠినమైన కొత్త యాంటీ–మనీ లాండరింగ్ (AML), నో యువర్ కస్టమర్ (KYC) మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 8న జారీ చేసిన ఈ నిబంధనల ప్రకారం, క్రిప్టో ఎక్స్ఛేంజీలను వర్చువల్ డిజిటల్ అసెట్ (VDA) సర్వీస్ ప్రొవైడర్లుగా గుర్తించి, సాధారణ డాక్యుమెంట్ అప్లోడ్లతో పాటు అదనపు భద్రతా చర్యలు తప్పనిసరి చేశారు. వీటిలో ఆన్‌బోర్డింగ్ సమయంలో లైవ్‌నెస్ డిటెక్షన్‌తో కూడిన ‘లైవ్ సెల్ఫీలు’, జియో ట్యాగింగ్ ద్వారా భౌగోళిక సమాచారం సేకరణ వంటి చర్యలు ఉన్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమ ఉనికిని నిర్ధారించేందుకు లైవ్ సెల్ఫీ తీసుకోవాలి. ఇందులో కళ్ల రెప్ప వేయడం లేదా తల కదలిక వంటి చర్యల ద్వారా స్టాటిక్ ఫొటోలు, డీప్‌ఫేక్‌ల వాడకాన్ని అడ్డుకుంటారు. అలాగే ఖాతా ప్రారంభ సమయంలో వినియోగదారి ఉన్న ప్రదేశానికి సంబంధించిన అక్షాంశం, రేఖాంశం, తేదీ, సమయం, ఐపీ చిరునామా వివరాలను ఎక్స్ఛేంజీలు నమోదు చేయాలి. ‘పెన్నీ–డ్రాప్’ విధానం కూడా తప్పనిసరి చేయగా, బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందని నిర్ధారించేందుకు నామమాత్రపు రూపాయి లావాదేవీ జరపాలి. పాన్‌తో పాటు పాస్‌పోర్ట్, ఆధార్ లేదా ఓటరు ఐడీ వంటి సెకండరీ గుర్తింపు పత్రాలు, అలాగే ఇ–మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌కు ఓటీపీ ధ్రువీకరణను వినియోగదారులు అందించాల్సి ఉంటుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!