

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో తలెత్తిన వివాదాలు, విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన పోలీసు చర్యలపై పార్లమెంట్లో విస్తృత చర్చ జరపాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇందుకోసం ఇండియా కూటమికి చెందిన ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. అనంతరం ఎక్స్‌లో స్పందించిన రాహుల్ గాంధీ, తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు అడిగిన విద్యార్థులపై లాఠీచార్జ్ జరగడం బాధాకరమని పేర్కొన్నారు.
దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందేనని రాహుల్ గాంధీ అన్నారు. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై కేంద్ర ప్రభుత్వం సభలో సమాధానం చెప్పాలని ప్రతిపక్షం కోరింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఇదే అంశాలపై చర్చకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభలో స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!