

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తన జెనరిక్ ఔషధాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. హెచ్‌ఐవీ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపయోగించే ‘లెనాకాపవిర్’ జెనరిక్ ఇంజెక్షన్లను భారత్‌తో పాటు విదేశాల్లో తయారు చేసి విక్రయించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లేకుండానే భారత్‌లో వీటిని తయారు చేసి మార్కెట్ చేసేందుకు సీడీఎస్‌సీఓ అనుమతి ఇచ్చింది. ఎంక్యూర్ ఫార్మాకు కూడా ఇదే తరహా అనుమతి లభించింది. ప్రస్తుతం ఒక్కో ఇంజెక్షన్ ధర సుమారు రూ.3,500 వరకు ఉండగా, కొత్త జెనరిక్ వెర్షన్లతో ధర 50–70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
లెనాకాపవిర్‌పై గిలీడ్ సైన్సెస్‌కు పేటెంట్ ఉండగా, భారత్ సహా 120 అల్పాదాయ దేశాల్లో రాయల్టీ లేకుండా ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు పలు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ ఆరిజెన్ ఫార్మాకు ఓ అంతర్జాతీయ సంస్థ నుంచి దీర్ఘకాలిక కాంట్రాక్టు లభించింది. ఇందులో భాగంగా స్టెరైల్ ఇంజెక్టబుల్స్, బయోలాజిక్స్‌ను తయారు చేసి సరఫరా చేయనుంది. తొలుత 20 ఉత్పత్తులతో ప్రారంభమయ్యే ఈ కాంట్రాక్టు ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!