

ఈ ఏడాది దేశవ్యాప్తంగా రాఖీల విక్రయాలు దాదాపు రూ.25,000 కోట్లకు చేరుకోవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా మిఠాయిలు, డ్రైఫ్రూట్స్, బహుమతులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను కలిపితే మొత్తం వ్యాపారం రూ.30,000 కోట్లను దాటే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో ఢిల్లీ మార్కెట్ వాటా దాదాపు రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని పేర్కొంది.
గత రెండు, మూడు సంవత్సరాలుగా చైనా తయారీ రాఖీల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని సీఏఐటీ జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. వినియోగదారులు దేశీయంగా తయారైన రాఖీలు, స్వదేశీ ఉత్పత్తులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా యువతలో థీమ్ ఆధారిత రాఖీలకు ఆదరణ పెరుగుతోందని వెల్లడించారు.
మరోవైపు పండగ సీజన్ ప్రారంభానికి ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ ప్లాట్‌ఫామ్‌లపై ఉత్పత్తులు విక్రయించే వ్యాపారులపై కొన్ని రుసుములు, జరిమానాలను పెంచాయి. అమెజాన్ ఇండియా ఈజీ షిప్, సెల్ఫ్ షిప్ సేవలకు సంబంధించిన ఆర్డర్ రద్దు రుసుములను పెంచగా, ఈ మార్పులు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ల సరఫరాలో లోపాలు, వైఫల్యాలకు సంబంధించి మూడు అంచెల జరిమానా విధానాన్ని ఆగస్టు 23 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయాలు తక్కువ మార్జిన్లతో వ్యాపారం చేస్తున్న చిన్న, మధ్య తరహా విక్రేతలపై అదనపు భారాన్ని మోపవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!