

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత ఔషధ ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవి తేజ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపశమన చర్యల కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఔషధ ఎగుమతులు 2025-26తో పోలిస్తే మరింత పెరుగుతాయని తెలిపారు. ఔషధ తయారీకి అవసరమైన కీలక ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలను రద్దు చేయడంతో పాటు, ఈ నెలాఖరుతో ముగియనున్న ఉపశమన చర్యలను అవసరమైతే మరికొంత కాలం కొనసాగించే అవకాశముందని చెప్పారు.
అమెరికా, యూరప్‌తో పాటు మధ్య ఆసియా, ఆఫ్రికా, రష్యా దేశాలకు కూడా భారత ఔషధ ఎగుమతులను విస్తరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రవి తేజ తెలిపారు. గత 12 సంవత్సరాల్లో భారత ఔషధ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,400 కోట్ల డాలర్లుగా ఉన్న ఎగుమతులు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధితో 3,100 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి అని వివరించారు.
2030 నాటికి 5,000 కోట్ల డాలర్ల ఔషధ ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనని రవి తేజ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే జెనరిక్ ఔషధాల్లో 20 శాతం భారత్ నుంచే సరఫరా అవుతున్నాయని గుర్తు చేశారు. అలాగే ఔషధ రంగంలోని చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ, విదేశీ నియంత్రణ సంస్థల వద్ద నమోదు మరియు తనిఖీల కోసం అయ్యే ఖర్చుల్లో 50 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!