

భారత ఎగుమతుల్లో జోరు కొనసాగుతోంది. ఈ ఆగస్టులో వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 26.12 శాతం వృద్ధితో 4,381 కోట్ల డాలర్లకు, అంటే సుమారు రూ.4.20 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2022 జూన్ తర్వాత నమోదైన అత్యధిక వృద్ధి ఇదే. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది.
ఇదే సమయంలో ఆగస్టులో దిగుమతులు దాదాపు 14.1 శాతం పెరిగి 7,076 కోట్ల డాలర్లకు, అంటే రూ.6.78 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు ఐదు నెలల కనిష్ఠ స్థాయి అయిన 2,686 కోట్ల డాలర్లకు తగ్గింది. బంగారం దిగుమతులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని మంగళవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ఏప్రిల్–ఆగస్టు కాలంలో భారత్ ఎగుమతులు 17.85 శాతం పెరిగి 21,591 కోట్ల డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 18.21 శాతం వృద్ధితో 36,300 కోట్ల డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 14,709 కోట్ల డాలర్లకు పెరిగింది. మరోవైపు, ఆగస్టులో బంగారం దిగుమతులు 230 కోట్ల డాలర్లకు తగ్గాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 540 కోట్ల డాలర్లతో పోలిస్తే 57.7 శాతం తగ్గాయి. బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల దేశీయంగా బంగారంపై ఆసక్తి తగ్గుతోందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!