

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం తిరుమలలో నిర్వహించిన చిన్నశేష వాహనసేవ సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ మలయప్పస్వామివారు దేవేరులతో కలిసి చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనసేవకు ముందు దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 20 కళాబృందాల నుంచి 539 మంది కళాకారులు భక్తి, సంగీతం, నృత్యం, జానపద కళారూపాలతో ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కళాకారులు తమ ప్రాంతాల సంప్రదాయ కళలను తిరుమలలో ఆవిష్కరించారు.
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల కళాకారులు భరతనాట్యం, ఒడిశీ, గరగాటం తదితర కళారూపాలను ప్రదర్శించగా, ఆంధ్రప్రదేశ్ బృందాలు ఎదుకుల వైభవం, కోలాటం, పుదుచ్చేరి కళాకారులు ఒయ్యిళ్లాట్టం ప్రదర్శించారు. వారణాసి కళాకారుల శ్రీమద్రామాయణం, మహారాష్ట్రకు చెందిన దగర్ గాజా, డ్రీమ్స్, అస్సాం కళాకారుల బోర్థాల్, పశ్చిమబెంగాల్ బృందాల ఒడిశీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహు, మంజునాథ చరితం, కాళింగ నర్తన, తమిళ జానపద కళారూపాలు కూడా భక్తులను అలరించాయి. సంప్రదాయ వస్త్రధారణ, సంగీతం, నృత్య ప్రదర్శనలతో తిరుమల వీధులు కళాశోభను సంతరించుకున్నాయి. వివిధ రాష్ట్రాల కళా సంప్రదాయాలు ఒకే వేదికపై ప్రదర్శించడంతో “భిన్నత్వంలో ఏకత్వం” అనే భారతీయ సంస్కృతి వైభవం ప్రతిబింబించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!