

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే అన్ని లావాదేవీలు ఇక పూర్తిగా ఉచితం కావు. వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) జరిగే బదిలీలపై ఎలాంటి రుసుము ఉండదు. అయితే పెద్ద వ్యాపార సంస్థలు, ఈ-కామర్స్ సంస్థలకు రూ.2,000కు మించి చేసే పీ2ఎం చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తించనుంది. అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం.. రూ.2,000లోపు పీ2ఎం లావాదేవీలను ఉచిత ఎలక్ట్రానిక్ చెల్లింపులుగా వర్గీకరించారు. చిన్న వ్యాపారులకు నెలకు రూ.1 లక్ష వరకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తే ఎలాంటి ఎండీఆర్ ఉండదు. వరుసగా మూడు నెలలు నెలకు రూ.1 లక్షకు మించి జమైతేనే ఆ ఖాతాను పీ2ఎం పరిధిలోకి తీసుకురానున్నారు.
కొన్ని నిర్దిష్ట రంగాల్లో రూ.2,000కు మించిన లావాదేవీలపై శాతానికి బదులుగా కేవలం రూ.5 స్థిర ఎండీఆర్ వర్తించనుంది. బీమా ప్రీమియాలు, పెట్రోల్-డీజిల్, ప్రభుత్వ విద్యుత్, నీరు, పైప్‌డ్ గ్యాస్ బిల్లులు, విద్యా రుసుములు, టెలికాం బిల్లులు, రైలు టికెట్లు వంటి చెల్లింపులు ఇందులో ఉన్నాయి. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్, ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితిని నిర్ణయించారు. 2025-26లో వ్యాపారులకు యూపీఐ ద్వారా జరిగిన చెల్లింపుల్లో రూ.2,000కు మించిన లావాదేవీలు సంఖ్యాపరంగా 4 శాతమే అయినప్పటికీ, మొత్తం విలువలో వాటి వాటా 66 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ రుసుముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖాతాదారు బ్యాంకులు, యూపీఐ యాప్ సంస్థలు, వ్యాపారులను అనుసంధానించే బ్యాంకుల మధ్య 40:30:30 నిష్పత్తిలో పంచనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!