

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలకు సవరించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని ప్రకటించింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన వ్యక్తి-వ్యాపారి చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300గా పరిమితి విధించారు. సాధారణ వినియోగదారులు చేసే యూపీఐ చెల్లింపులు మాత్రం ఉచితంగానే కొనసాగనున్నాయి. వ్యక్తుల మధ్య జరిగే P2P లావాదేవీలు, రూ.2,000 వరకు వ్యాపార చెల్లింపులు ఎండీఆర్ పరిధిలోకి రావు.
చిన్న వ్యాపారులకు ఎండీఆర్ నుంచి మినహాయింపు ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.లక్ష వరకు బ్యాంకు ఖాతాలోకి చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీ వర్తించదు. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం వంటి నిర్దిష్ట విభాగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ అమలు చేయనున్నట్లు సమాచారం. మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు 0.02 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ.300గా ఉంటుంది. యూపీఐ యాప్‌లు అదనపు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా రహస్య ఛార్జీలు విధించకూడదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!