

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. వ్యోమగాముల భద్రతకు అత్యంత కీలకమైన క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన మూడు క్వాలిఫికేషన్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష యాత్ర ముగిసిన తర్వాత భూమికి తిరిగి వచ్చే సమయంలో, సముద్రంలో ల్యాండ్ అయిన అనంతరం వ్యోమగాముల భద్రతను నిర్ధారించే సాంకేతికతలను ఈ పరీక్షల ద్వారా ధృవీకరించింది.
మొదటి పరీక్షలో క్రూ మాడ్యూల్ అప్‌రైటింగ్ సిస్టమ్ సముద్రంలో మాడ్యూల్ తలకిందులైనా దానిని స్వయంచాలకంగా నిటారుగా మార్చగల సామర్థ్యాన్ని నిరూపించింది. రెండో అంబిలికల్ సెపరేషన్ టెస్ట్ ద్వారా క్రూ మాడ్యూల్‌కు అనుసంధానమైన వ్యవస్థలు ఎలాంటి ఆటంకం లేకుండా సురక్షితంగా విడిపోతాయని నిర్ధారించింది. మూడో అపెక్స్ కవర్ సెపరేషన్ లోడ్స్ పరీక్షలో వాస్తవ పరిస్థితుల కంటే 1.75 రెట్లు అధిక ఒత్తిడిని తట్టుకుని క్రూ మాడ్యూల్ నిర్మాణం సురక్షితంగా నిలిచినట్లు ఇస్రో వెల్లడించింది.
ఈ మూడు పరీక్షల విజయంతో గగన్‌యాన్ మిషన్ భద్రతపై ఇస్రోకు మరింత విశ్వాసం పెరిగింది. త్వరలో ప్రయోగించనున్న మానవరహిత గగన్‌యాన్ జీ-1 మిషన్ విజయానికి ఇవి బలమైన పునాది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యోమగాముల ప్రాణ భద్రతకు ఇస్రో ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతకు ఈ విజయాలు నిదర్శనంగా నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!