

బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్)ల జాయింట్ వెంచర్ అయిన టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) మరో కీలక మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లోని అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి ఏహెచ్-64ఈ అపాచీ పోరాట హెలికాప్టర్‌కు సంబంధించిన 400వ ఫ్యూజ్‌లేజ్‌ను విజయవంతంగా తయారు చేసి సరఫరా చేసినట్లు సంస్థ ప్రకటించింది. భారత్‌లో తయారైన ఈ ఫ్యూజ్‌లేజ్‌లను పూర్తి స్థాయి హెలికాప్టర్లలో అమర్చి అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల సైనిక దళాలకు సరఫరా చేస్తున్నారు. గత ఏడాది భారత సైన్యానికి బోయింగ్ ఆరు అపాచీ హెలికాప్టర్లను అందించింది. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 22 ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.
2016లో ప్రారంభమైన టీబీఏఎల్‌లో 750 మందికి పైగా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అధునాతన రోబోటిక్స్, ఆటోమేషన్, ఏరోస్పేస్ తయారీ సాంకేతికతలను వినియోగిస్తూ అపాచీ హెలికాప్టర్లకు అవసరమైన ఫ్యూజ్‌లేజ్ ఏరోస్ట్రక్చర్లను సంస్థ తయారు చేస్తోంది. హైదరాబాద్‌లో 52 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం భారత్‌లో ఏరోస్పేస్ తయారీ సామర్థ్యం పెరుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ తయారీ సామర్థ్యం ద్వారా భారత ఏరోస్పేస్ రంగం పరిణతి, ప్రపంచ రక్షణ సరఫరా గొలుసుల్లో దేశం భాగస్వామ్యం మరింత బలపడుతున్నాయని టీబీఏఎల్ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!