

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వినియోగదారులకు మరోసారి ధరల షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన కొన్ని కార్ల మోడళ్ల ధరలను రూ.20 వేల వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. సవరించిన ధరలు సెప్టెంబర్ నుంచే అమల్లోకి వస్తాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే తర్వాత మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
గత కొన్ని నెలలుగా వ్యయాలను నియంత్రిస్తూ కార్ల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, ద్రవ్యోల్బణం, ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్ఠంగా రూ.20 వేల వరకు పెంపు ఉంటుందని తెలిపింది. వినియోగదారులపై భారం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో వంటి ఎంట్రీ లెవల్ కార్ల నుంచి ఇన్విక్టో వంటి ప్రీమియం యుటిలిటీ వాహనాల వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!