

తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మహిళా పోలీసు అధికారులు మంత్రికి వివరించారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసభ్యంగా ప్రవర్తించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను అసభ్యంగా తాకారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్‌ను మంత్రికి చూపించి ఫిర్యాదు చేశారు.
విధులు నిర్వహిస్తున్న సమయంలో టీ షర్టులు విసిరి తమపైకి వచ్చారని, పరిస్థితిని అదుపు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని మహిళా పోలీసులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూస్తామని కొందరు బెదిరించినట్లు ఆరోపించారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, ఇలాంటి విధులు చేయాల్సిన అవసరం లేదని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వారికి ధైర్యం చెబుతూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని, తమ విధులను నిర్భయంగా కొనసాగించాలని, ఎలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!