

క్విక్ కామర్స్‌లో పోటీ ఇప్పుడు వేగంగా డెలివరీ చేయడానికే పరిమితం కావడం లేదు. అధిక మార్జిన్లు, ధరలపై నియంత్రణ, సరుకుల లభ్యత, ఇన్వెంటరీ నిర్వహణతో పాటు కస్టమర్లను తమ ప్లాట్‌ఫామ్‌లోనే కొనసాగించేందుకు సంస్థలు సొంత బ్రాండ్లపై దృష్టి పెడుతున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 2025 ప్రారంభంలో క్విక్ కామర్స్ విక్రయాల్లో ప్రైవేట్ లేబుల్స్ వాటా సుమారు 6 శాతం ఉండగా, ప్రస్తుతం అది దాదాపు 16 శాతానికి చేరింది. పప్పులు, బియ్యం, పిండి, వంట నూనెలు వంటి రోజువారీ నిత్యావసరాలే ఈ సొంత బ్రాండ్ల విస్తరణకు ప్రధాన కేంద్రంగా మారాయి.
టాటా గ్రూప్‌కు చెందిన బిగ్‌బాస్కెట్ సొంత బ్రాండ్ల విషయంలో పోటీ సంస్థల కంటే ముందంజలో ఉంది. దాని ప్రైవేట్ లేబుల్స్ మొత్తం ఆదాయంలో సుమారు 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. బీబీ పాపులర్, బీబీ రాయల్, బీబీ హోమ్, ఫ్రెషో వంటి బ్రాండ్లు వివిధ విభాగాల్లో విస్తరిస్తున్నాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సుప్రీమ్ హార్వెస్ట్ ద్వారా స్టేపుల్స్‌లో దూకుడు పెంచగా, జెప్టో డైలీ గుడ్ కూడా పప్పులు, డ్రైఫ్రూట్స్, నూనెల విభాగాల్లో వాటా పెంచుకుంటోంది. మరోవైపు బ్లింకిట్‌కు చెందిన హోల్ ఫార్మ్ మిల్లెట్స్, ప్రత్యేక స్టేపుల్స్ వంటి ఎంపిక చేసిన విభాగాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. క్రమంగా స్నాక్స్, బెవరేజెస్, డ్రైఫ్రూట్స్, పండ్లు, కూరగాయల విభాగాల్లోనూ సొంత బ్రాండ్ల విస్తరణ జరుగుతోంది.
అధిక లాభాలే ప్రైవేట్ లేబుల్స్‌పై సంస్థల ఆసక్తికి ప్రధాన కారణంగా మారాయి. స్టేపుల్స్‌లో ప్రైవేట్ లేబుల్స్ ద్వారా 15 నుంచి 25 శాతం వరకు మార్జిన్లు లభిస్తున్నాయని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి. థర్డ్‌పార్టీ బ్రాండ్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. తక్కువ ధరలకు ఉత్పత్తులను అందించి విక్రయాలను పెంచే వ్యూహాన్ని కూడా కంపెనీలు అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ఇన్వెంటరీ, ధర, సరుకుల లభ్యతపై ప్లాట్‌ఫామ్‌లకు ఎక్కువ నియంత్రణ లభిస్తోంది. ఒక ఉత్పత్తి అందుబాటులో లేకపోతే కస్టమర్ వెంటనే మరో యాప్‌కు మారే అవకాశం ఉండటంతో, డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి సొంత బ్రాండ్ల ద్వారా తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచడం సంస్థలకు కీలకంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!