

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఛార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ కూడా వేగంగా సాగుతోంది. 2026 జులై నాటికి దేశవ్యాప్తంగా 52,718 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా, వీటిలో 16,561 స్టేషన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. అయితే కేవలం స్థిర ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా హైవేలపై నిరంతర విద్యుత్ సరఫరా, తగిన కనెక్టర్లు, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం అవసరం. మారుమూల ప్రాంతాల్లో ఈవీ బ్యాటరీ ఖాళీ అయితే సమీపంలో ఛార్జింగ్ స్టేషన్ లేకపోవడం వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్ ఈవీ ఛార్జింగ్ సేవలు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.
ఈవీ యజమాని నుంచి సమాచారం అందిన వెంటనే మొబైల్ ఛార్జింగ్ వాహనం ఘటనాస్థలికి చేరుకుని అవసరమైన మేరకు బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సాధారణంగా ఛార్జింగ్ పరిమాణాన్ని బట్టి వినియోగదారుడి నుంచి రుసుము వసూలు చేస్తారు. సమీప ఛార్జింగ్ స్టేషన్ వరకు వెళ్లేందుకు అవసరమైనంత ఛార్జింగ్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వీటిని అత్యవసర రోడ్‌సైడ్ సేవలుగా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో పెట్రోలు బంకులు, హైవే సర్వీస్ సెంటర్లు మల్టీ ఎనర్జీ మొబిలిటీ సెంటర్లుగా మారే అవకాశం ఉంది. సంప్రదాయ ఇంధనాలతో పాటు ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్, మొబైల్ ఛార్జింగ్ సేవలు అందించే అవకాశం ఉంది. గ్రిడ్ కనెక్షన్ లేని ప్రాంతాల్లో మొబైల్ యూనిట్లకు ఇథనాల్ ఆధారిత జనరేటర్లను ఉపయోగించి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అందించవచ్చు. అయితే వాహనం, ఛార్జింగ్ పరికరాలు, విద్యుత్, నిర్వహణ, సిబ్బంది, ప్రయాణ ఖర్చులు ఉండటంతో ఈ అత్యవసర సేవలకు సాధారణ ఛార్జింగ్ కంటే ఎక్కువ ధర ఉండొచ్చు. దేశంలో హాప్‌ఛార్జ్, ఛార్జర్ ఆన్ వీల్స్, ఈవీ రీఛార్జ్, ఛార్జో, స్పేర్‌ఎక్స్ఛేంజ్/నెజో ఎనర్జీ ఇండియా, మొబెక్ ఇన్నోవేషన్, ఎజ్‌ఉర్జా, మైఫ్యూయల్ ఈవీ, ఓల్ట్‌యాంప్ రెన్యూవబుల్ ఎనర్జీ వంటి సంస్థలు మొబైల్ ఈవీ ఛార్జింగ్ రంగంలో సేవలు అందిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!