

ఖగోళ శాస్త్రవేత్తలు జె1328-1450 అనే శ్వేత మరుగుజ్జు తార చుట్టూ రెండు విభిన్న వాయు వలయాలను గుర్తించారు. ఈ వలయాల్లో విచ్ఛిన్నమైన గ్రహాల అవశేషాలు ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. నక్షత్రం తన జీవిత చరమాంకంలో వెలుపలి పొరలను కోల్పోయి, అత్యంత సాంద్రత కలిగిన కోర్ భాగం మాత్రమే మిగలడంతో శ్వేత మరుగుజ్జు తారగా మారింది. అయితే ఈ ప్రక్రియలో చుట్టూ ఉన్న చిన్న గ్రహాలు పూర్తిగా నాశనం కాకుండా మిగిలి ఉండొచ్చని, వాటి అవశేషాలే మృత నక్షత్రం చుట్టూ అనూహ్యమైన వాయు వలయాల ఏర్పాటుకు కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ఆధ్వర్యంలో చిలీలోని వెరీ లార్జ్ టెలిస్కోప్ ద్వారా ఈ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను గుర్తించారు.
సూర్యుడి జీవితకాలం ముగిసే దశలో దాని కోర్లోని హైడ్రోజన్ ఇంధనం క్రమంగా ఖర్చవుతుంది. సుమారు 500 కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడు భారీగా విస్తరించి రెడ్ జెయింట్గా మారి కొన్ని గ్రహాలను కబళించే అవకాశం ఉంది. అనంతరం వెలుపలి పొరలు తొలగిపోయి శ్వేత మరుగుజ్జు తారగా మిగులుతుంది. జె1328-1450 చుట్టూ ఒకే వలయం కాకుండా రెండు వలయాలు కనిపించడం శాస్త్రవేత్తలకు కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఈ వలయాలను ప్రత్యక్షంగా పరిశీలించకపోయినా, వాటి గురుత్వాకర్షణ ప్రభావాలు, పరిసర ధూళితో జరిగే పరస్పర చర్యల ద్వారా ఉనికిని గుర్తించారు. వలయాలను వేర్వేరుగా ఉంచేందుకు ప్లానెటిసిమాల్స్ అనే చిన్న ఖగోళ వస్తువులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. లోపలి వలయంలో మెగ్నీషియం అధికంగా ఉండగా, వెలుపలి వలయంలో దాని పరిమాణం తక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం రెండు వలయాలు ఒకే గ్రహంలోని భిన్న పొరల అవశేషాలు లేదా వేర్వేరు గ్రహాలకు చెందిన శకలాలు కావచ్చనే అంచనాలకు బలం చేకూరుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!