

భారత్‌లోని గేమర్స్ జీటీఏ 6 (ది గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6) విడుదలను సంబరంగా జరుపుకుంటున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై స్పందించారు. జీటీఏ 5, జీటీఏ 6 విడుదల మధ్య ఉన్న 13 ఏళ్ల వ్యవధిలో భారత్ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక గ్రాఫిక్ చిత్రాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలన, డిజిటల్ చెల్లింపుల విస్తరణ, అంతరిక్ష రంగంలో విజయాలు, నక్సల్ రహిత భారత్ లక్ష్యం వంటి అంశాలను ఈ చిత్రాల్లో ప్రస్తావించారు. ‘భారత్ ఇప్పుడు సరికొత్త ఆట ఆడుతోంది’ అంటూ మోదీ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన వీడియో గేమ్‌లలో జీటీఏకు ప్రత్యేక స్థానం ఉంది. జీటీఏ 5 విడుదలైన 13 ఏళ్ల తర్వాత తాజాగా జీటీఏ 6 అందుబాటులోకి వచ్చింది. ఈ గేమ్ ట్రైలర్‌ను 2023లో విడుదల చేయగా.. తొలి రోజే 9 కోట్లకు పైగా వీక్షణలు సాధించినట్లు సమాచారం. దీంతో అత్యధిక మంది వీక్షించిన నాన్ మ్యూజిక్ వీడియోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. తాజాగా విడుదలైన గేమ్‌కు భారీ స్థాయిలో ప్రీ ఆర్డర్లు వచ్చినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. వీటి విలువ సుమారు 1.65 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.
జీటీఏ 6 రూపకల్పనలో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ రాక్‌స్టార్ గేమ్స్ స్టూడియోకు చెందిన 1,615 మంది డెవలపర్లు భాగస్వాములయ్యారు. గేమ్‌లోని ఓపెన్ వరల్డ్ వాతావరణం, వివిధ అసెట్స్, ప్రపంచ నిర్మాణం, వైస్ బీచ్ వంటి ప్రాంతాల రూపకల్పనలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈ స్టూడియో చరిత్రకు ధ్రువ ఇంటరాక్టివ్‌తో సంబంధం ఉంది. రాజేశ్ రావు 1995లో ఒకే కంప్యూటర్‌తో ఈ సంస్థను ప్రారంభించారు. ఇది భారత్‌లో తొలి గేమింగ్ స్టూడియోగా గుర్తింపు పొందింది. 2019లో రాక్‌స్టార్ గేమ్స్ దీనిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం జీటీఏ 6 ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X|S ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!