

ఏఐతో మెహందీ వేసే ఓ యంత్రానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ ‘ఇంకొన్ని ఉద్యోగాలు పోయాయి’ అని వ్యాఖ్యానించారు. వీడియోలో ఓ మహిళ తన చేతిని ప్రత్యేకంగా రూపొందించిన యంత్రం వద్ద ఉంచగా.. అది ఆమె చేతిపై అందమైన మెహందీ డిజైన్‌ను వేస్తుంది. ఈ ప్రక్రియలో మనుషుల ప్రమేయం చాలా తక్కువగా కనిపించడంతో నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
ఈ వీడియోతో యాంత్రీకరణ వల్ల సంప్రదాయ వృత్తులపై పడే ప్రభావంపై చర్చ మొదలైంది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మెహందీ కళాకారులకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే యంత్రాలు వేగంగా, ఒకే విధమైన ఖచ్చితత్వంతో డిజైన్లు వేయగలిగితే వారి ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చేతితో వేసే మెహందీలోని సృజనాత్మకత, వ్యక్తిగత నైపుణ్యం, మానవ స్పర్శను యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేవని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!