

న్యూఢిల్లీలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమ్మిట్‌కు ముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. గత రెండు మూడు బ్రిక్స్ సమావేశాల ద్వారా భారత్‌కు వచ్చిన స్పష్టమైన, కనిపించే ప్రయోజనాలు ఏమిటో అర్థం కావడం లేదని సీనియర్ నేత పి. చిదంబరం వ్యాఖ్యానించారు. భారత్ బ్రిక్స్‌తో పాటు ఎస్‌సీఓ, జీ20, క్వాడ్ వంటి పలు బహుళపక్ష కూటముల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఆయా సమావేశాల ద్వారా దేశానికి లభించిన ప్రత్యక్ష ఫలితాలపై స్పష్టత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
చిదంబరం వ్యాఖ్యలకు భిన్నంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బ్రిక్స్ సమ్మిట్ దౌత్య ప్రాధాన్యతను ప్రశంసించారు. ప్రపంచంలోని గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ఒక ముఖ్యమైన వేదికను అందిస్తోందని, 2026 బ్రిక్స్ సమ్మిట్‌కు ఆతిథ్యమివ్వడం దేశానికి ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. బ్రిక్స్ కూటమి ప్రపంచ జనాభాలో సగానికి పైగా, ప్రపంచ జీడీపీలో 41 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ భారత్ అభివృద్ధిని, ఎదుగుదలను విమర్శించేలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. ‘స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే ఇతివృత్తంతో భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సహా సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరుకానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!