

అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేసినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయాని, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు వేర్వేరుగా కలిశారు. అసెంబ్లీ వద్ద పోలీసులు తమపై వ్యవహరించిన తీరును సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించి అవమానించారని, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వారు ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఎదుట జరిగిన ఘటన కౌరవ సభను తలపించిందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టి లాగారని, పురుష ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కారని ఆమె పేర్కొన్నారు. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అవమానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించిందని బీఆర్‌ఎస్ నేతలు కమిషన్లకు ఫిర్యాదు చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!