

టీ20 క్రికెట్‌లో ఇప్పటికే తన సత్తా చాటిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ.. ఎర్ర బంతి క్రికెట్‌లోనూ అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించి సౌత్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. బుధవారం ముగిసిన మ్యాచ్‌లో సౌత్ జోన్.. నార్త్ జోన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులు చేసిన తిలక్.. రెండో ఇన్నింగ్స్‌లో 79 బంతుల్లో 8 ఫోర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. దీంతో 181 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాలుగో వికెట్‌కు రవిచంద్రన్ స్మరణ్ (32 నాటౌట్)తో కలిసి తిలక్ 80 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. నార్త్ జోన్ తరఫున అబిద్ ముస్తాక్ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా.. నిధీశ్ 5/56తో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ 195 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌత్ 312 పరుగులు చేసింది. తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
టెస్టు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచే తనకు ఎంతో ఇష్టమని తిలక్ వర్మ తెలిపాడు. ఎర్ర బంతి క్రికెట్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తానని, తన బలం కూడా అదే ఫార్మాట్ అని చెప్పాడు. పదేళ్ల వయసు నుంచే టెస్టు క్రికెట్‌లో రాణించేందుకు కష్టపడుతున్నానని వెల్లడించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా గత మూడు, నాలుగేళ్లుగా రంజీ ట్రోఫీలో ఎక్కువగా ఆడే అవకాశం దక్కలేదన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన కలలో కూడా ఊహించలేదని, అది దేవుడి ప్రణాళిక అని పేర్కొన్నాడు. ఇక సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇలాగే రాణిస్తూ భారత టెస్టు జట్టులో చోటు సంపాదించడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్ ఆదివారం ఈస్ట్ జోన్‌తో తలపడనుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!