

చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కిదాంబి శ్రీకాంత్ విజయంతో బోణీ కొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్‌ను 21-16, 21-15తో వరుస గేముల్లో ఓడించాడు. ఆధిపత్య ప్రదర్శనతో సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. అక్కడ కెనడాకు చెందిన విక్టర్ లాయ్‌తో తలపడనున్నాడు. మరోవైపు భారత నంబర్‌వన్ పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. విక్టర్ లాయ్ చేతిలో 14-21, 7-21తో ఓడి తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి గేమ్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన లక్ష్య.. ఆ తర్వాత లాయ్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. ఈ ఓటమితో లాయ్ చేతిలో లక్ష్యకు ఇది మూడో పరాజయంగా నమోదైంది.
మరోవైపు ఇతర విభాగాల్లో భారత ఆటగాళ్లు మెరుగైన ఫలితాలు సాధించారు. మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ 21-16, 21-17తో డెన్మార్క్‌కు చెందిన అమైల్ షుల్జ్‌ను ఓడించి రెండో రౌండ్‌కు చేరింది. అక్కడ జపాన్‌కు చెందిన తొమోకా మియాజకితో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 21-11, 21-6తో మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్-కాంగ్ కై జింగ్ జంటను ఓడించి ముందంజ వేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంట కూడా 21-8, 21-9తో థాయ్‌లాండ్‌కు చెందిన తొనాకోర్న్ సేహెంగ్-తొనిచా సేహెంగ్ జోడీపై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!