

వయసు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే సంకల్పానికి అడ్డంకి కాదని నిరూపించిన కార్త్యాయని అమ్మ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. కేరళలోని అలప్పుజ జిల్లా చెప్పాడ్‌కు చెందిన ఆమె 1922లో జన్మించారు. పేదరికం కారణంగా చిన్నతనంలో పాఠశాలకు వెళ్లలేకపోయిన ఆమె. దేవాలయాల్లో స్వీపర్‌గా, ఇళ్లలో పనిమనిషిగా పనిచేశారు. చిన్న వయసులోనే వివాహం జరగడంతో ఆరుగురు పిల్లలకు తల్లయ్యారు. భర్త మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఒంటరిగా మోస్తూ అక్షరజ్ఞానానికి దూరంగా ఉండిపోయారు.
కుమార్తె అమ్మిని అమ్మ సుమారు 60 ఏళ్ల వయసులో కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ కోర్సును పూర్తి చేయడం కార్త్యాయని అమ్మకు ప్రేరణగా మారింది. “నా కూతురు చేయగలిగితే నేను ఎందుకు చేయలేను?” అనే ఆలోచనతో 2018లో 96 ఏళ్ల వయసులో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ నిర్వహించిన ‘అక్షరలక్ష్యం’ కార్యక్రమంలో చేరారు. మనవళ్లు, మనవరాళ్ల సహాయంతో చదవడం, రాయడం, గణితం నేర్చుకుని ఆగస్టులో సుమారు 40 వేల మందితో కలిసి పరీక్ష రాశారు.
చదవడం, రాయడం, గణితం విభాగాల్లో నిర్వహించిన పరీక్షలో 100కు 98 మార్కులు సాధించి కేరళలోనే అత్యధిక వయసున్న విద్యార్థినిగా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. చదవడం, గణితంలో పూర్తి మార్కులు సాధించగా, రాయడంలో రెండు మార్కులు మాత్రమే కోల్పోయారు. ఈ విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆమె కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నుంచి మెరిట్ సర్టిఫికేట్ అందుకున్నారు. అనంతరం 4వ తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 10వ తరగతి సమానమైన పరీక్ష రాయాలని, కంప్యూటర్ నేర్చుకోవాలని ఆకాంక్షించారు. 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యారు. 101 ఏళ్ల వయసులో 2023 అక్టోబర్ 10న ఆమె కన్నుమూశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!