

యూత్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన్వి పాత్రి చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్‌కు చేరిన తొలి భారత అమ్మాయిగా రికార్డులకెక్కింది. బుధవారం ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన యుజునో వతానబెపై 21-14, 11-21, 21-19తో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలి గేమ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన తన్వి సులువుగా విజయం సాధించింది. అయితే రెండో గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి పుంజుకుని గెలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం తన్వి పట్టుదలతో ఆడి కీలక విజయాన్ని అందుకుంది.
గురువారం జరిగే ఫైనల్లో తన్వి పసిడి పతకం కోసం పోరాడనుంది. గతంలో భారత్ నుంచి ముగ్గురు పురుష షట్లర్లు యూత్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. వారిలో ప్రణయ్ 2010లో, లక్ష్య సేన్ 2018లో రజత పతకాలు సాధించగా.. ఆదిత్య మాత్రం పతకం గెలవలేకపోయాడు. ఇప్పుడు తన్వి ఫైనల్‌కు చేరడంతో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో ప్రత్యేక ఘట్టం నమోదైంది. ఫైనల్లో గెలిస్తే యూత్ ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన క్రీడాకారిణిగా నిలవనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!