

కడప వైఎస్సార్‌సీపీకి బలమైన రాజకీయ పునాది ఉన్న ప్రాంతంగా మరోసారి చర్చకు వచ్చింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ స్థానాన్ని గెలుచుకున్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డికి 66,027 ఓట్లు రావడం జిల్లాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నామినేషన్ల దశ నుంచి పోలింగ్ వరకు దాడులు, బెదిరింపులు, ఒత్తిళ్లు చోటుచేసుకున్నాయని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. మొత్తం 66 డివిజన్లలో 52 డివిజన్లు ఏకగ్రీవమైనట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల్లోనూ తమ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి ప్రచారంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆమెకు జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్ రామాంజులరెడ్డి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు 46వ డివిజన్‌లో జమీల్ 344 ఓట్ల మెజారిటీతో, 33వ డివిజన్‌లో దేవిరెడ్డి ఆదిత్య సతీమణి సంధ్యారాణి 139 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ రెండు డివిజన్లలో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు లేకపోవడం, రిగ్గింగ్, ఓటర్లను అడ్డుకోవడం వంటి అంశాలపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బండి దీప్తిరెడ్డికి 66,027 ఓట్లు రావడం కడప రాజకీయాల్లో చర్చకు దారితీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!