

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వయసు ముప్పైల చివర్లో ఉన్నప్పటికీ.. మైదానంలో వారి చురుకుదనం మాత్రం పాతికేళ్ల యువ ఆటగాళ్లను తలపిస్తోంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నిలకడగా ఆడుతున్న డారిల్ మిచెల్‌ను రోహిత్ మెరుపు వేగంతో రనౌట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. గ్లెన్ ఫిలిప్స్ షార్ట్ మిడ్‌వికెట్ దిశగా బంతిని నెట్టి సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా.. క్షణాల్లో స్పందించిన రోహిత్ బంతిని అందుకుని వికెట్ కీపర్‌కు వేగంగా విసిరాడు. దీంతో క్రీజులోకి చేరలేకపోయిన మిచెల్ పెవిలియన్ బాట పట్టాడు.
మరోవైపు కోహ్లి కూడా తన ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. కంబోజ్ బౌలింగ్‌లో నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అందుకున్నాడు. ఈ రెండు అద్భుత విన్యాసాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వయసు కేవలం అంకె మాత్రమేనని రోహిత్, కోహ్లి తమ చురుకుదనంతో మరోసారి నిరూపించారు. అనంతరం బ్యాటింగ్‌లో రోహిత్ విఫలమైనప్పటికీ.. బౌలర్ల ఆధిపత్యం కొనసాగిన మ్యాచ్‌లో కోహ్లి తనదైన శైలిలో అద్భుత షాట్లు ఆడి ప్రేక్షకులను అలరించాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!