

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఒలింపిక్ కోటా స్థానాలను సాధించాలని ఆశిస్తున్న భారత్‌కు నిరాశ ఎదురైంది. బుధవారం జరిగిన 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్, 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లలో భారత షూటర్లు ఫైనల్‌కు చేరలేకపోయారు. 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్‌లో సోనమ్ ఉత్తమ్ మస్కర్, హిమాంశు దిల్లాన్ జంట 632.4 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి నాలుగు జట్ల ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో భవేశ్ షెకావత్ 582 పాయింట్లతో 12వ స్థానంలో నిలవగా.. గుర్‌ప్రీత్ (579) 18వ, సూరజ్ శర్మ (571) 35వ స్థానాల్లో నిలిచారు. 2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ ఈ టోర్నీతో ప్రారంభమైనప్పటికీ.. భారత్ ఇప్పటివరకు ఒలింపిక్ వ్యక్తిగత ఈవెంట్‌లో పతకం లేదా కోటా స్థానాన్ని సాధించలేదు. పురుషుల 50మీ పిస్టల్, మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లలో భారత్ రజత పతకాలు సాధించినా.. అవి ఒలింపిక్ కోటా స్థానాలను అందించే విభాగాలు కావు.
మరోవైపు భారత షూటర్ శాంభవి క్షీర్‌సాగర్ దుస్తులు, పరికరాలకు సంబంధించిన అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) నిబంధనలను ఉల్లంఘించినందుకు అనర్హతకు గురైంది. ఆమె ధరించిన షూటింగ్ దుస్తుల మందం అనుమతించిన పరిమితికి మించి ఉండటంతో అధికారులు పోటీలో పాల్గొనేందుకు అనుమతించలేదు. దీంతో శాంభవి, పార్థ్ మానే జంట 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఇదే కారణంతో జూన్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ శాంభవిపై అనర్హత వేటు పడటం గమనార్హం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!