

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతోనే కాకుండా బ్రాండ్ ప్రపంచంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నవంబర్ 5న తన పుట్టినరోజు సందర్భంగా మైదానం బయట అతడు నిర్మించుకున్న బ్రాండ్ సామ్రాజ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ఆ తర్వాత ఫిట్‌నెస్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఆగస్టు 2026లో విడుదలైన క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025 నివేదిక ప్రకారం, కోహ్లీ బ్రాండ్ విలువ 158.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,320 కోట్లు)గా నమోదైంది. ఈ జాబితాలో భారత్‌లో మూడో స్థానంలో నిలిచిన అతడు, క్రీడాకారుల్లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే కోహ్లీ బ్రాండ్ విలువ తగ్గినప్పటికీ, ప్రకటనల రంగంలో అతడి ప్రభావం మాత్రం కొనసాగుతోంది.
ప్రకటనల ప్రపంచంలోనూ కోహ్లీ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 2010లో జెనీలియా డిసౌజాతో కలిసి ఫాస్ట్రాక్ ప్రకటనలో కనిపించి యూత్‌ను ఆకట్టుకున్నాడు. 2013లో నెస్లే మంచ్ యాడ్‌లో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. అదే ఏడాది క్లియర్ షాంపూ ప్రకటనలో అనుష్క శర్మతో కలిసి నటించడం వారి పరిచయానికి ప్రత్యేక గుర్తుగా నిలిచింది. ఆ పరిచయం ప్రేమగా మారి 2017లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం మాన్యావర్-మోహే, ప్యూమా, one8, టూ యమ్, మింత్రా, లివ్‌స్పేస్, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రచారాల్లో భాగమయ్యాడు. అనుష్కతో కలిసి పలు ప్రకటనల్లోనూ సందడి చేశాడు. విజిట్ దుబాయ్ ప్రచారంతో పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసిన కోహ్లీ.. 2026లో జాన్ వాకర్ 'కీప్ వాకింగ్' ప్రచారంలోనూ కనిపించాడు. ఇలా క్రికెట్‌తో పాటు వ్యాపారవేత్తగా, బ్రాండ్ అంబాసిడర్‌గా విభిన్న రంగాల్లో తన ప్రభావాన్ని చాటుకుంటున్నాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!