

ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక మార్పు తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో కొత్త ఓటు నమోదు కోసం సమర్పించే ఫారం-6 (Form 6) నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డిక్లరేషన్‌ను వేరు చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఈ మార్పు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఓటరు జాబితాలో కొత్తగా పేరు చేర్చుకోవాలనుకునే వారు ఆన్‌లైన్ ఫారం-6 నింపేటప్పుడు ఎస్‌ఐఆర్ డిక్లరేషన్‌ను జత చేయాల్సిన అవసరం ఉండదు. ఆ డిక్లరేషన్‌ను ప్రత్యేకంగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పెంచే లక్ష్యంతో ఈ మార్పు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
మరోవైపు, ఎన్నికల సంఘం అంతర్గత పరిపాలనా విధానాల్లోనూ పలు మార్పులు చేపట్టింది. ఇకపై అధికారుల సమావేశాలకు సంబంధించిన అజెండాను ముందుగానే సభ్యులకు పంపించడంతో పాటు, సమావేశం ముగిసిన తర్వాత అధికారిక మినిట్స్ జారీ చేయనున్నారు. అలాగే ఎన్నికల సంఘంలో పనిచేసే అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే ముందస్తుగా ఈసీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మాడ్యూళ్ల ఆమోద ప్రక్రియలోనూ మార్పులు తీసుకొచ్చింది. ఇకపై కొత్త ఐటీ మాడ్యూళ్ల ప్రతిపాదనలను ముందుగా ప్రత్యేక కమిటీ పరిశీలిస్తుంది. ఆ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే తుది ఆమోదం కోసం ఎన్నికల సంఘం ముందుకు తీసుకెళ్తారు. ఈ మార్పుల ద్వారా నిర్ణయాల ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ఈసీ భావిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!