

బ్యాడ్మింటన్ ఆటలో ప్రతి క్షణం పరిస్థితులు మారుతుంటాయని.. అలాంటి సమయంలో కోర్టులో సహనంగా ఉండటం ఎంతో ముఖ్యమని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో నిలిచిన ఆమె.. డిసెంబరు 9 నుంచి 13 వరకు జరిగే ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-6లో నిలవడం సంతోషంగా ఉందని పేర్కొంది. ర్యాంకుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పింది. 30, 31, 32 ఏళ్ల వయసులోనూ ఎంతోమంది క్రీడాకారులు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారని.. తాను మళ్లీ టాప్ ర్యాంక్‌కు ఎందుకు చేరుకోలేనని ప్రశ్నించింది. ఆ దిశగానే తన ప్రయాణం కొనసాగుతోందని తెలిపింది. ‘‘31 ఏళ్లు అంటే కొత్తగా 21 ఏళ్లు వచ్చినట్లే. గతంలో మ్యాచ్‌లో ఓడితే తీవ్ర నిరాశ, కోపం వచ్చేవి. ఇప్పుడు ఆటలోని సవాళ్లు, మానసిక స్థితి, పొరపాట్లను మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతున్నా. అందుకే ఇప్పుడు విజయాలు మరింత తీపిగా అనిపిస్తున్నాయి’’ అని సింధు వివరించింది.
మరోవైపు 25 సెకన్ల షాట్ క్లాక్ నిబంధనను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సమీక్షించాలని సింధు కోరింది. సుదీర్ఘ ర్యాలీల తర్వాత ఆటగాళ్లు అలసిపోతారని, అలాంటి సమయంలో నిర్ణీత 25 సెకన్లలో సర్వీస్ చేయలేదని ఎల్లో, రెడ్ కార్డులు విధించడం సరికాదని అభిప్రాయపడింది. ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో 19-19 స్కోరు వద్ద ఫ్రాన్స్ జోడీకి రెడ్ కార్డు పెనాల్టీ విధించిన ఘటనను ఉదాహరణగా ప్రస్తావించింది. ఇలాంటి నిబంధనలపై సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొంది. ఇదే సమయంలో తనకు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంతో స్ఫూర్తినిచ్చాడని వెల్లడించింది. కుంగుబాటులో ఉన్న సమయంలో కోహ్లీతో మాట్లాడానని, క్లిష్ట పరిస్థితుల్లో మానసికంగా తిరిగి ఎలా పుంజుకోవాలి, ఆటను ఎలా ఆస్వాదించాలనే విషయంలో ఆయన చెప్పిన మాటలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని సింధు తెలిపింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!