

హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ, ఖానామెట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు నిర్మించారని, ప్రస్తుతం మరో 80 భవనాల వరకు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. నోటరీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ పది నుంచి పన్నెండు అంతస్తుల వరకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. రెండు భవనాల మధ్య కనీస దూరం కూడా లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, సెల్లార్లలో కిచెన్లు నిర్వహిస్తూ కాలేజీలు, పీజీ హాస్టళ్లు కొనసాగిస్తున్నారని తెలిపారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు లేని కారణంగా నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల అండతోనే అక్రమ నిర్మాణాలకు అనుమతులు లభిస్తున్నాయని విమర్శించారు. సైబరాబాద్ మున్సిపల్ అధికారుల తీరుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఖానామెట్‌లో సమగ్ర సర్వే నిర్వహించి, అనుమతులు లేని భవనాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని, ఈలోగా అక్రమ భవనాలపై చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ తరఫున వెళ్లి వాటికి రెడ్ మార్క్ వేస్తామని కవిత హెచ్చరించారు. అయ్యప్ప సొసైటీలో భూములు కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందులు పడవద్దని సూచించారు. నోటరీ రిజిస్ట్రేషన్లపై రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ చేపట్టాలని, నిజమైన భూ యజమానులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలో ఆర్టీఐ వ్యవస్థ నిర్వీర్యమైందని, వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. మరోవైపు, రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని, హైదరాబాద్‌లో రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ కొరత సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకుని తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!