

టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ తీసే ప్రయత్నంలో బలంగా నేలకు పడటం వల్ల అతనికి తీవ్రమైన గాయం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కడుపు భాగానికి దెబ్బ తగలడంతో ప్లీహం దెబ్బతిని అంతర్గత రక్తస్రావం జరిగినట్లు సమాచారం బయటకు వచ్చింది.
ప్రస్తుతం అయ్యర్ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్ధివాలా పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల చేసిన అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ రిపోర్ట్ ప్రకారం అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నా, పూర్తి ఫిట్నెస్ చేరుకోడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. కడుపుపై ఒత్తిడి పెరిగే విధంగా వ్యాయామాలు చేయొద్దని అతనికి స్పష్టంగా సూచించారు.
ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు, అలాగే జనవరిలో న్యూజిలాండ్‌తో ఉండే వైట్‌బాల్ మ్యాచ్‌లకు అయ్యర్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ మరియు ఐపీఎల్ 2026 లో అతను పాల్గొంటాడా లేదా అనేది మరికొంత సమయం తర్వాతే తెలుస్తుంది.
వచ్చే వారం అయ్యర్ మరోసారి అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోనున్నాడు. రెండు నెలల తర్వాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రీహ్యాబ్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!